సీనియ‌ర్ హాస్య న‌టుడు సార‌ధి కన్నుమూత

చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియ‌ర్ హాస్య న‌టుడు సార‌ధి తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తిపేరు కడలి జయసారథి . టాలీవుడ్‌లో సారథిగా పాపులర్ అయ్యారు. ఆయన గతకొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నగరంలోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారని సారథి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. టాలీవుడ్‌లో దాదాపు 372 సినిమాల్లో నటించిన సారథి, ఆయన చేసిన కామెడీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు.

1960లో స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు రూపొందించిన‌ సీతారామ క‌ళ్యాణం సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఆ చిత్రంలో ఆయ‌న న‌ల కుబేరుడి పాత్ర‌లో న‌టించారు. ఆ త‌ర్వాత అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగానూ వ‌ర్క్ చేశారు. నాటకరంగానికి సేవచేశారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించారు. సారిధిపై మ‌ర‌ణంపై తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేసింది. కాగా, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో జయసారథి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

SHARE