ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు..తడిసిముద్దవుతున్న తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రం మొత్త్తం తడిసిముద్దవుతోంది. గత వారం మొత్తం భారీ వర్షాలు పడగా..ఆ తర్వాత రెండు రోజులు కాస్త ఎండలు కొట్టాయో లేదో మళ్లీ వర్షాలు అందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు పడుతుండడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా..లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలో అర్ధరాత్రి తర్వాత వర్షం దంచికొట్టింది. సైదాబాద్‌, మలక్‌పేట, నారాయణగూడ, మహియత్‌నగర్‌, చార్మినార్‌, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, బార్కస్‌, చాంద్రయాణగుట్టలో వర్షం కురిసింది. చంపాపేట్‌, సంతోష్‌నగర్‌, చాదర్‌ఘాట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలీపురంతో పాటు పలు ప్రాంతాల్లో మూడు గంటల పాటు వర్షం కురవడం తో ఇళ్లలోకి నీరు చేరింది. రాత్రి భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంభయంగా గడిపారు. కోఠిలో ఓ బైక్ వరద నీటిలో కొట్టుకుపోయింది. మలక్ పేట్ బ్రిడ్జ్ దగ్గర నడుములోతు వరకు నీరు ప్రవహించటంతో చాలా సేపు రాకపోకలు స్తంభించాయి.

రంగారెడ్డి జిల్లా గండిపేట జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్‌పల్లిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి గండిపేట జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూడు ఫీట్ల మేరా 6 క్రస్ట్ గేట్లు ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

SHARE