లగేజ్ చార్జీలు పెంచిన టీఎస్ ఆర్టీసీ

ప్రయాణికులపై మరో భారం మోపింది టీఎస్ ఆర్టీసీ. ఇప్పటికే టికెట్ చార్జీలను అమాంతం పెంచేసి ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్న ఆర్టీసీ..ఇప్పుడు లగేజ్ ఫై కూడా భారీగా చార్జీలను పెంచింది. పెంచిన చార్జీలు శుక్రవారం నుండి అమల్లోకి వస్తున్నాయి. అంతేకాదు, సాధారణ ప్రయాణికులు మోసుకెళ్లే బ్యాగులు, వాటి బరువుపైనా కఠిన నిబంధనలు వచ్చాయి.

50 కిలోల వరకు ఉచిత లగేజీకి అవకాశం ఇస్తున్నా ఆర్టీసీ.. ఇకపై అదనపు లగేజీ మరింత భారం కానుంది. 50 కిలోల బరువుకు అదనంగా ఒక కిలో పెరిగినా.. పాతిక కేజీల వరకు ఒక యూనిట్‌గా పరిగణించి.. పూర్తి చార్జీని వసూలు చేయనున్నారు. అలాగే, ప్రయాణికుడు ఉచితంగా తీసుకెళ్లే 50 కిలోల బరువు కూడా మూడు ప్యాకెట్ల (బ్యాగులు, సూట్‌కేసులు వగైరా)కు మించి ఉండకూడదు. ప్రతి ప్యాకెట్‌ 20 కిలోల బరువు మించి ఉండకూడదు. ఒకవేళ ఉచిత పరిమితిలోపు ఉండే బరువు మూడు ప్యాక్‌లకు మించితే అదనపు ప్యాక్‌లపై చార్జీ విధిస్తారు.

బస్సుల్లో ట్రక్కు టైర్లు తరలించాలంటే ఇకపై 3యూనిట్లుగా పరిగణించి ఛార్జీలు వసూలు చేయనున్నారు . టీవీ, ఫ్రిజ్‌, సైకిల్‌, ఫిలింబాక్సులు, వాషింగ్‌ మెషీన్‌, కార్‌ టైర్లను 2 యూనిట్లుగా, రేడియో, ఖాళీ బ్యాటరీ, టేబుల్‌ ఫ్యాన్‌, 25 లీటర్ల ఖాళీక్యాన్‌, కంప్యూటర్‌ మానిటర్‌, సీపీయూ, హార్మోనియం తదితరాలను ఒక యూనిట్‌గా పరిగణించనున్నారు.

ప్రతి యూనిట్‌కు ఇప్పటివరకు పల్లెవెలుగు బస్సుల్లో 25 కిలోమీటర్ల దూరం వరకు రూ. 1 ఛార్జీ వసూలు చేసేవారు. ఈ నెల 22 నుంచి ఆ చార్జీ రూ. 20కి పెరగనుంది. 26 – 50 కిలోమీటర్ల మధ్య లగేజీ ఛార్జీ ప్రతి యూనిట్‌కు ఇంతకుముందు రూ.2గా ఉండగా రూ. 40కి పెరిగింది. 51-75 కి.మీ. మధ్య రూ.3 నుంచి రూ.60కి, 76 – 100 కి.మీ మధ్య రూ. 4 నుంచి రూ.70కి పెరిగింది. డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో లగేజీ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

SHARE