రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడంటూ రేవంత్ ఫైర్

రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి వంటి ద్రోహిని చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. చండూరులో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్‌ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ తాజా మాజీ రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

గత ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ టికెట్‌ పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సింది. కానీ, ఆ టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఆ త్యాగం గుర్తులేదా? అని రాజగోపాల్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. మునుగోడులో చరిత్ర హీనుడైన రాజగోపాల్ రెడ్డి.. నమ్మిన కార్యకర్తలను మోసం చేసి అమిత్ షా పంచన చేరారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియానే తెలంగాణ తల్లి. అలాంటి సోనియాను హింసిస్తే ఊరుకుంటామా? అని రేవంత్‌ ఆగ్రహం వెల్లగక్కారు.

కన్న తల్లి లాంటి సోనియాను మోడీ, అమిత్ షా ఈడీ పేరుతో వేధింపులకు పాల్పడుతుంటే అవేమీ పట్టించుకోకుండా ఆయన బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. 75 ఏళ్ల వయస్సులో… కరోనాతో బాధపడుతున్న సోనియాను అమిత్ షా, మోడీ కక్షగట్టి ఈడీ విచారణ పేరుతో వేధిస్తున్నారని వాపోయారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సోనియాను అవమానిస్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా ఊరుకుందామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని, సోనియా ప్రతిష్టను అమిత్ షా కాళ్ల దగ్గర పెట్టిన రాజగోపాల్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

SHARE