వరద నష్టాలపై కేంద్రానికి తెలంగాణ సర్కార్ నివేదిక

తెలంగాణ రాష్ట్రంలో భారీ వరదలు , వర్షాలు తీవ్ర నష్టాలు తెచ్చాయి. దీంతో వరద సాయం చేయాలనీ కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ కోరింది. ఈ మేరకు వరద నష్టాలఫై నివేదిక పంపింది. వరదలు, వర్షాల కారణంగా పలు శాఖలకు రూ.1400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ నివేదికలో పేర్కొంది. తక్షణ సాయంగా రూ.1000 కోట్లను మంజూరు చేయాలని కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని అభ్యర్థించింది.

వరదల కారణంగా రోడ్లు, భవనాల శాఖకు రూ.498 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. పంచాయతీ రాజ్ శాఖకు రూ.449 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.33 కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.379 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.7 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపింది. వరదల కారణంగా ఇళ్లు కూలిపోవడం వల్ల, ముంపు బాధితులను తరలించడం కోసం రూ.25 కోట్లు ఖర్చయ్యాయని.. మొత్తంగా రూ.1400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు నివేదిక రూపొందించారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భారీ వర్షాలు కురిసాయి. ముఖ్యంగా గోదావరి వరద రికార్డు స్థాయికి చేరింది. 36 ఏళ్ల క్రితం భద్రాచలం వద్ద 70 అడుగుల మేర ప్రవహించగా..ఇప్పుడు మరోసారి ఆలా ప్రవహించి వందలాది ఇళ్లను నీటిలో ముంచేసింది. భద్రాచలం పట్టణంలో కూడా పలు కాలనీ లు నీటమునిగాయి. ఇప్పటికీ చాలా మంది ప్రజలు గోదావరి ముంపు నుంచి బయటపడలేదు. గోదావరి పరీవాహక ప్రాంతంలో పర్యటించిన సీఎం కేసీఆర్.. వరద నష్టాన్ని అంచనా వేశారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పరిశీలించారు.

SHARE