రూ.10 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేయబోతున్నాం మంత్రి ప్రశాంత్‌రెడ్డి

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా పాడైపోయిన సంగతి తెలిసిందే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వెంటనే రోడ్లు మరమ్మతులు చేయాలనీ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, కల్వర్టులు.. కోతకు గురైన రోడ్ల గురించి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రహదారుల పరిస్థితి గురించి ఈఎన్సీ రవీందర్‌రావును వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1733 కిలోమీటర్ల పొడవున రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మత్తులకు రూ.379.50 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక తెగిపోయిన 8.4 కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణకు రూ.13.45 కోట్లు.. 39.8 కిలోమీటర్ల పొడవైన కోతలకు గురైన రోడ్లుకు గాను రూ.7.10 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న 412 కల్వర్టుల మరమ్మత్తులకు రూ.98.19 కోట్లు.. శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులకు మొత్తం కలిపి రూ.498.24 కోట్లు ఖర్చు అవుతాయని సంబంధిత ఇంజనీర్లు రూపొందించిన అంచనాలను మంత్రి పరిశీలించారు. అతి త్వరలోనే ఈ మరమ్మత్తులు పూర్తి చేయాలనీ చూస్తున్నారు.

SHARE