తెలంగాణ లో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు..

తెలంగాణలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఆగ్నేయ మధ్యప్రదేశ్‌, పరిసరాల్లో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ 26 నుంచి 30వ తేదీ మధ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తూర్పు రాజస్థాన్, పరిసర ప్రాంతం నుండి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వరకు ద్రోణి కొనసాగుతోందన్నారు. ఇది సముద్ర మట్టం నుండి 1.5 కి.మీ నుండి 3.1కి.మీ మధ్య వ్యాపించి ఉందన్నారు. ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా సముద్ర మట్టం నుండి 0.9 కి మీ వరకు ద్రోణి వ్యాపించి ఉందన్నారు. ఇప్పటికే భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా..లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అర్ధరాత్రి సిటీని భారీ వర్షం ముంచెత్తింది. ఒంటి గంటకు ప్రాంభమైన వర్షం..తెల్లవారుజామున 4 గంటల వరకు కురిసింది. ఇక.. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో జులై 26, 30 తేదీల్లో.. కోస్తాంధ్ర ప్రాంతంలో 26, 29, 30న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ట్విట్టర్‌లో పేర్కొంది.

SHARE