విమానంలో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడి వార్తల్లో నిలిచారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. రాజకీయాల్లోకి రాకముందు తమిళిసై ఓ డాక్టర్. కానీ రాజకీయాల్లోకి వచ్చాక తన వృత్తిని కొనసాగించే టైం లేకుండాపోయింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడి వార్తల్లో నిలిచారు. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో బాధపడుతున్నాడు. విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్ లు ఉన్నారా అని ప్రకటించారు. ఈ విషయం తెలిసిన తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు.

బాధితుడు కోలుకున్నాక‌… విమాన సిబ్బందికి ఆమె కొన్ని సూచ‌న‌లు చేశారు. విమానం బ‌య‌లుదేరే ముందే ప్ర‌యాణికుల్లో డాక్ట‌ర్లు ఉన్న‌ట్లయితే… ముందుగా చార్ట్‌లోనే విష‌యాన్ని తెలియ‌జేయాల‌ని ఆమె సూచించారు. అంతేకాకుండా అస్వస్థతకు గురైన వ్యక్తికి వెంటనే సీపీఆర్ చేయగలిగేలా సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కూడా ఆమె ఇండిగో సంస్థకు సూచించారు. కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. అదేవిధంగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు అభినందనలు తెలిపారు.అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని కొన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

SHARE