సోనియా ఈడీ విచారణ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నల్లదుస్తులు ధరించి నిరసన

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు ఈరోజు సోనియాను విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలిపింది. ఇక హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నేతలు , కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్లదుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. కొందరు నేతలు కార్యకర్తలు నల్ల రంగు బెలూన్లు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. దారి పొడవునా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ర్యాలీ కొనసాగించారు. ర్యాలీ సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సోనియాగాంధీని ఈడీ పేరిట కేంద్ర ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి అంజన్‌ కుమార్ నల్ల దుస్తులు, బెలూన్స్‌ ప్రదర్శిస్తూ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలివెళ్లారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సోనియా గాంధీని ఈడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వేధించడాన్ని ఆయన ఖండించారు.

మరోపక్క ఈడీ సోనియా కు బ్రేక్ ఇచ్చారు. దాదాపు 2 గంటల పాటు ఈడీ అధికారులు సోనియాను ప్రశ్నించారు. ఆరోగ్య కారణాలతో(ఇటీవల కరోనా నుంచి కోలుకోవడం) ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుని.. సోనియా ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు.

SHARE