జగన్ కు స్వీట్లు తినిపించినప్పుడు ఆ విషయం గుర్తు లేదా కేసీఆర్ ..? – షర్మిల

వైస్ షర్మిల మరోసారి కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. శనివారం భద్రాచలం ముంపు ప్రాంతాలలో పర్యటించారు. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ..తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా.. భద్రాచలం కరకట్టను కేసీఆర్ ఎందుకు కట్టలేదని అని షర్మిల ప్రశ్నించారు. వరదలకు కారణం క్లౌడ్ బస్టర్ అని సీఎం కేసీఆర్ అంటే.. కాదు పోలవరం కారణమని ఓ మంత్రి అంటాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో పార్టీ పెట్టిన ఇన్నాళ్లలో తన అన్న జగన్ గురించి ఒక్క మాటకూడా మాట్లాడని షర్మిల.. తొలిసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి జగన్ కు మధ్య ఉన్న సమన్వయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పోలవరం ప్రాజెక్టును మెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు పోలవరం గురించి విమర్శలు చేయటం ఏంటీ అంటూ ప్రశ్నించారు. భద్రాచలం ముంపుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణమైతే ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేదు అని..పక్క రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డిని స్వయంగా ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు.. మీకు ఈ విషయం గుర్తు లేదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం మునిగిపోతుందని అప్పుడు తెలియదా? అంటూ షర్మిల నిలదీశారు. ప్రజలకు సహాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలవరం ప్రాజెక్టును బూచిగా చూపించి టిఆర్ఎస్ ప్రభుత్వం సాకులు చెబుతోందంటూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరద బాధితులకు రూ.1 సహాయం కూడా చెయ్యకుండా కెసిఆర్ ప్రభుత్వం రోజుకో కథ చెబుతోంది అని వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు. అంతేకాదు 2008లో వైయస్సార్ భ‌ద్రాచ‌లం క‌ర‌క‌ట్ట ఎత్తు పెంచాల‌ని ప‌నులు ప్రారంభిస్తే.. నేటికీ కెసిఆర్ పూర్తి చేయ‌లేదని షర్మిల విమర్శించారు .

SHARE