భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో స్కూల్ పిల్లలకు పెను ప్రమాదం తప్పింది

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత వారం రోజుల పాటు వర్షాలు పడగా..కాస్త ఉపశమనం ఇచ్చాయి అనుకునేలోపే రాత్రి నుండి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాలో స్కూల్ పిల్లలకు పెను ప్రమాదం తప్పింది.

రాత్రి నుండి జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. ఈ వర్షాలకు నర్సింహులపేట మండలం కొమ్ముల వంచ కొత్త చెరువు జోరుగా మత్తడి పోస్తున్నది. ఈ క్రమంలో రోడ్డు పైనుంచి వరద పారుతుండటంతో సాయంత్రం తోరూరు ఆర్యభట్ట స్కూల్ బస్సు పిల్లలు తీసుకొని వస్తుండగా..వరదల్లో చిక్కుకున్నది. దీనిని గమనించిన స్థానికులువిద్యార్థులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

ఉప‌రిత‌ల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు విస్తారంగా వ‌ర్షాలు కూరుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర, ద‌క్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడ‌క్కడ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని.. ఈ రోజు భారీ నుండి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం పేర్కొంది.

SHARE