బిజెపి ఎంపీలు రాజీనామా చేయాలనీ రేవంత్ డిమాండ్

బిజెపి నలుగురు ఎంపీలు రాజీనామా చేయాలనీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. ఉప ఎన్నికలతోనే అభివృద్ధి జరుగుతుందంటే..తక్షణమే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే 28 నియోజకవర్గాలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కేవలం వేల కోట్ల కాంట్రాక్ట్ ల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ లోకి వెళ్ళాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు ఓటేసి టీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలుగా మారారన్నారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు రూ.40 లక్షలు, 50 లక్షలకు అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. అమ్ముడుపోయిన వాళ్లంతా అభివృద్ధి అని అంటున్నారని… ప్రజాస్వామ్యం గెలవాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. రాష్ట్రం ఏర్పడినా పాలకుల నిర్లక్ష్యం వల్ల నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య తీరలేదన్నారు. 8 ఏళ్లైనా ఫ్లోరైడ్ సమస్యకు కేసీఆర్ పరిష్కారం చూపించలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలిచ్చినా నెరవేర్చలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, రైతుకు రూ.లక్ష రుణమాఫీ వంటి హామీలు నెరవేర్చలేదన్నారు.

SHARE