మూసీ ఉగ్రరూపానికి లోతట్టు ప్రాంతాలు విలవిల

మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. 300 ఇండ్లలోకి నీళ్లు చేరాయి. చాదర్ ఘాట్, శంకర్ నగర్, మూసారాంబాగ్, ఓల్డ్ మలక్ పేట, కమలానగర్, జీయగూడ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ నడుస్తుంది. అధికారులు 1,500 ఇండ్లకు కరెంట్ సప్లయ్ ​బంద్ చేసారు. బుధవారం ఉదయం నుండి మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహించింది. అటు జీయాగూడ – పురానాపూల్100 ఫీట్ రోడ్డు పూర్తిగా నీట మునిగింది. దీంతో ఇటుగా రాకపోకలు నిలిపివేశారు.

ఎగువన చేవెళ్ల, పరిగి, వికారాబాద్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గండిపేట, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో మూసీలోకి ఒక్కసారిగా భారీ వరద చేరింది. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం వరద సహాయక చర్యలను చేపట్టింది. క్షేత్ర స్థాయిలో వరద పరిస్థితులను పర్యవేక్షిస్తూ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

వరద ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. గండిపేట వద్ద వరదలో చిక్కుకుపోయిన ఓ కుటుంబాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. గండిపేట వద్ద ఓ ఫాంహౌస్‌లో నివసిస్తున్న ఈ కుటుంబం వరద ప్రవాహం పెరగడంతో జలదిగ్భంధంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

SHARE