కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు రాజగోపాల్ రెడ్డి. మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. బిజెపి పార్టీ లో చేరే విషయం ఇంకా ఆలోచించలేదని క్లారిటీ ఇచ్చారు.

గత రెండు వారాలుగా నా రాజీనామా ఫై చర్చ నడుస్తుంది. దీంతో నా రాజీనామాపై చర్చ పక్కదారి పట్టింది. నా గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నారు. అయినా రాజీనామాపై నాన్చే ఉద్దేశం నాకు లేదు. మునుగోడు ప్రజల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది. మునుగోడులో అసలు అభివృద్ధి లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో కూడా నాకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వట్లేదు. పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం ఇంతవరకూ ఏమీ చేయలేదు. గిరిజనులను అధికారులు వేధిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తేనే ఈ ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచిస్తోంది.. చేస్తోందని ఆయన అన్నారు. ఒక ఎస్సీ నేత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటే కేసీఆర్‌ సహించలేకపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో కలుపుకున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా ప్రాజెక్టులను కేసీఆర్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేసారని , రైతుబంధు ఇస్తూ… మిగతా అన్ని పథకాలను రద్దు చేసారని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద అడ్డగోలుగా అప్పులు చేసారని , కేసీఆర్‌ కుటుంబం కోసమే తెలంగాణను సాధించుకున్నట్లు ఉందని అన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తి ఉందని రాజగోపాల్ అన్నారు. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లపై ప్రజలు అందరినీ నిలదీస్తున్నారు. అనుకూలంగా ఉన్నవారికి రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారని రాజగోపాల్ ఆరోపించారు. ఇక మోడీ హయాంలో దేశం అభివృద్ధి చేస్తుందని అన్నారు.

మాటలు పడి,నిందలు మోసి, ఆత్మగౌరవం లేకుండా పదవిలో కొనసాగాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసిన రాజగోపాల్.. ప్రజలకు న్యాయం జరుగుతుందనే తాను రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియపరు. ఉప ఎన్నిక వస్తే ఎవరిని గెలిపించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని, కుటుంబ పాలనపైనే తన పోరాటమన్న రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ ప్రజల భవిష్యత్ కోసమే తన పోరాటమని తేల్చిచెప్పారు.

SHARE