మునుగోడు ఉపఎన్నిక ఖాయం- రాజగోపాల్

మునుగోడు ఉప ఎన్నిక రావడం పక్కా అని ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంకేతాలు పంపుతున్నారు. గత కొద్దీ రోజులుగా రాజగోపాల్ బిజెపి చేరబోతారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడబోతోంది. మరో రెండు మూడు రోజుల్లో ఈయన బిజెపి కండువా కప్పుకోబోతున్నారు. శనివారం సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

మునుగోడు ప్రజలు భావిస్తే ఉపఎన్నిక వస్తుంది. మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణవ్యాప్తంగా చర్చ జరగాలి. మునుగోడు తీర్పు తెలంగాణలో మార్పునకు నాంది కావాలి. ఆ ఉప ఎన్నికతో తెలంగాణలో తప్పక మార్పు వస్తుంది. నేను కేసీఆర్‌పై ధర్మ యుద్ధం చేస్తున్నా. పదిహేనురోజుల్లో నా నిర్ణయం ఉంటుంది. అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అధికార టీఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారని రాజగోపాల్ మండిపడ్డారు. తాను చేయబోయే యుద్ధం పార్టీల మధ్య కాదని, ప్రజలు కేసీఆర్ కు మధ్య జరిగే యుద్ధమని అన్నారు. మునుగోడు ప్రజలు నిర్ణయించిన తర్వాతే యుద్ధం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అభివృద్ధి కేవలం సిరిసిల్ల, సిద్ధిపేటకే పరిమితమైందన్న రాజగోపాల్.. హుజూరాబాద్లో పోయిన పరువును ప్రలోభాలతో కాపాడుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నిక వస్తే తెలంగాణ రాజకీయాలు మారిపోతాయని అన్నారు.

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలమయ్యాయి. ఏఐసీసీ దూతలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిలు రాజగోపాల్ రెడ్డితో భేటీ అయినా ఫలితం లేకుండా పోయింది. రాహుల్ మాటగా ఢిల్లీ రావాలని, పార్టీ మార్పుపై తొందరపాటు నిర్ణయంతీసుకోవద్దని ఇరువురు నేతలు కోరినట్లు తెలుస్తోంది. అయితే వారి విజ్ఞప్తిని రాజగోపాల్ తోసిపుచ్చినట్లు సమాచారం.

SHARE