హైదరాబాద్ లో భారీ వర్షం : జీహెచ్ఎంసీ ఆఫీస్ కు ఫిర్యాదుల వెల్లువ

మహానగరంలో మరోసారి కుండపోత వర్షం పడింది. ఉదయం నుండే వర్షం పడుతుండగా..శుక్రవారం సాయంత్రం నగరవ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. దీంతో పలు కాలనీ లు నీటమునిగాయి. ఇక రోడ్లపై మోకాల్లోతు నీరు చేరింది. ఈ క్రమంలో GHMC ఆఫీస్ కు ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. అత్యధికంగా రోడ్లపై నిలిచిన నీళ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలపై ఫిర్యాదులు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అలర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. రాబోయే మూడు నాలుగు గంటల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

షియర్‌ జోన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, నగరంలో అక్కడక్కడా భారీ వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. లంగర్‌హౌస్‌, గోల్కొండ, కార్వాన్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, నాచారం, మల్లాపూర్‌, ఈసీఐఎల్‌, చర్లపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్‌, ఉప్పల్‌, బోడుప్పల్‌, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌‌, వనరస్థలిపురం, హయత్‌నగర్‌, తుర్కయంజాల్‌, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, విద్యానగర్‌, రాంనగర్‌, సికింద్రాబాద్‌ స్టేషన్‌, కాచిగూడ , జీడిమెట్ల తదితర ప్రాంతాలలో భారీ వర్షం పడింది.

SHARE