జవహర్ నగర్ డంపియ్ యార్డు వద్ద ఉద్రిక్తత

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపియ్ యార్డు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. డంపింగ్ యార్డును ఎత్తివేయాలంటూ పలు పార్టీల ప్రజా ప్రతినిధులు ధర్నాకు దిగారు. ఇటీవల కురుస్తున్నభారీ వర్షాలకు డంపింగ్ యార్డు నుంచి విష వాయువులు వెలువడుతున్నాయని, ఫలితంగా కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు గగ్గులుపెట్టారు. కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కలిసి రాంపల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

రాంకీ..సంస్థ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. విషపు మురుగునీరు ఇళ్లలోకి వదిలేస్తున్నారని ప్రజలు వెల్లడించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, డంపింగ్ యార్డు యాజమాన్యం వెంటనే ఇక్కడకు రావాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గత వారం కిందనే మున్సిపల్ చైర్మలతో కలిసి రాంకీ సంస్థతో మాట్లాడడం జరిగిందన్నారు. చెత్త ఫిల్టర్ చేయడానికి నెలకు రూ. 10 కోట్లు ఇస్తున్నామని, అయినా రాంకీ సంస్థ ఇళ్ల మధ్యకు మురికి నీళ్లు వదలడం సమంజసం కాదన్నారు.

SHARE