టీఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు

టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పి పలువురు బిజెపి , కాంగ్రెస్ పార్టీలలో చేరగా..తాజాగా ఈరోజు ఆదివారం ఎర్రబెల్లి ప్రదీప్ రావు టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసారు. త్వరలోనే ఈయన బిజెపి లో చేరబోతారని తెలుస్తుంది.

రాజీనామా ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రదీప్ రావు.. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చినా వారికి కనీస సాయం చేయలేకపోతున్నానని వాపోయారు. టీఆర్ఎస్ లో 9 ఏళ్ల పాటు క్రమశిక్షణతో ఉండి నిస్వార్థంగా పనిచేశానని, పదవులు ఇవ్వకున్నా పార్టీకి సేవ చేస్తూనే ఉన్నానని చెప్పారు. కనీస గుర్తింపు లేనప్పుడు పార్టీలో కొనసాగడం ఎందుకన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ప్రదీప్ రావు తెలిపారు. సంస్కారంలేని నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని ప్రదీప్ రావు అభిప్రాయపడ్డారు. ఏ పార్టీలో చేరాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన.. వరంగల్ తూర్పు ప్రజలతో కలిసి ముందుకు నడుస్తానని చెప్పారు.

తన సహకారం లేకుండానే నరేందర్ రావు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని.. ఆయనకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ప్రదీప్‌రావు సవాల్ చేశారు. ఈ నెల పదో తేదీలోగా తన సవాల్‌ని స్వీకరించాలన్నారు. తన సవాల్‌పై ఎమ్మెల్యే స్పందించిన తర్వాతే తాను ఏ పార్టీలో చేరనున్నది ప్రకటిస్తానన్నారు. వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు వేల కోట్ల రూపాయలు అభివృద్ది పనులకు ఖర్చు చేసినట్టుగా ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఏ పార్టీలో చేరినా ప్రజల కోసమే పనిచేస్తానని ప్రదీప్‌రావు స్పష్టం చేశారు.

పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట తప్పినప్పుడు కూడా తాను బాధపడలేదని.. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే తనను అసభ్యంగా దూషిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం కలిచివేసిందని ప్రదీప్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం మాట్లాడినా నోరు మూసుకుని ఉండటానికి తాను నరేందర్ బానిసని కాదని.. ఆత్మగౌరవం ఉంది కాబట్టే గౌరవంగా పార్టీ నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు.

SHARE