ఓల్డ్ సిటీ లో టెన్షన్..టెన్షన్

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల MIM నేతలు, కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఓల్డ్ సిటీ ఏ క్షణాన ఏమవుతుందో అనే ఆందోళన నెలకొంది ఉంది. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని పరిస్థితులను అదుపులోకి ఉంచుతున్నారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. అనంతరం ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో రాజాసింగ్ నేరుగా గోషామహల్ లోని ఆయన నివాసానికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడం, అదే సమయంలో రాజాసింగ్ కు వ్యతిరేకంగా పాతబస్తీలో కొందరు నినాదాలు చేశారు. ఇరువర్గాల నిరసనల నేపథ్యంలో పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు పాతబస్తీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

అయితే రాజాసింగ్‌ను అరెస్టు చేయాలంటూ కొందరు యువకులు బైకులపై ప్రదర్శన నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి చార్మినార్‌ పరిసర ప్రాంతాలతో పాటు శాలిబండ, మొఘల్‌పురాలోని పలు ప్రాంతాల్లో రాజాసింగ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అర్ధరాత్రి మొదలైన నిరసనలు ఉదయం కూడా కొనసాగాయి. చుడీ బజార్ ప్రాంతంలో దుకాణాలు మూసి వేసి, రోడ్లపై నల్లజెండాలతో నిరసన తెలిపారు. శాలిబండలో రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ యువకులు ఆందోళన చేపట్టారు. పలు చోట్ల పోలీసు వాహనాలపై దాడి చేయడంతో పలు వెహికల్స్‌ ధ్వంసమయ్యాయి. ఇక గోషామహల్‌ వెళ్లే ప్రధాన రహదారులన్నింటిని పోలీసులు పూర్తిగా మూసివేశారు. పాతబస్తీలో భారీగా బలగాలను మోహరించారు.

SHARE