ఆగస్టు 07 న నేతన్న బీమా పథకం ప్రారంభం..

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ నేతన్న బీమా పధకాన్ని ప్రారభించబోతుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా చేనేత కార్మికులకు బీమా పథకం తీసుకురాబోతున్నారు. రైతు బీమా మాదిరే నేతన్నకు బీమా అందనుంది. నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. అందులో భాగంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని అమలుచేయనున్నామని తెలిపారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి రూ.5 లక్షలు అందచేస్తామన్నారు. పది రోజుల్లో ఈ మొత్తం ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలోని సుమారు 80 వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. 60 ఏళ్లలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు పథకానికి అర్హుడు కానున్నాడు. దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే ఐదు లక్షల బీమా పరిహారం అందనుంది. నేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నేత కార్మికులకు బీమాతో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్గుతుందన్నారు.

SHARE