తెలంగాణ లో మంకీపాక్స్‌ కలకలం

తెలంగాణ రాష్ట్రంలో మంకీపాక్స్‌ కలకలం రేపింది. కరోనా మహమ్మారి ఉదృతి పూర్తిగా తగ్గకముందే మరో మహమ్మారి భారత్ లో ప్రవేశించింది. ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న మంకీపాక్స్ మన దేశంలోకి కూడా ప్రవేశించింది. ఇప్పటికే నాల్గు కేసులు వెలుగులోకి రాగా..తాజాగా తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌ కాలనీకి చెందిన ఇద్దరు దంపతుల్లో మంకీపాక్స్‌ వ్యాధి లక్షణాలు బయటపడటం కలకలం రేపింది.

దీంతో వారిద్దరిని హైదరాబాద్‌లోని ఫీవర్‌ హాస్పటల్ కు తరలించారు. ప్రత్యేక వార్డులో వారికీ చికిత్స చేస్తున్నట్టు డాక్టర్స్ వెల్లడించారు. బాధితుల్లో ఒకరు ఈ నెల 6న కువైట్‌ నుంచి వచ్చారని, ఆయనకు 20న జ్వరం, 23 తేదీ నాటికి దద్దుర్లు రావడంతో చికిత్స కోసం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పటల్ కు వెళ్లాడని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్‌ జీ శ్రీనివాసరావు తెలిపారు. అక్కడి వైద్యుడు మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్నట్టు గుర్తించడంతో తొలుత జిల్లా హాస్పటల్ కు, అక్కడి నుంచి ఫీవర్‌ హాస్పటల్ కు తరలించినట్టు వివరించారు. బాధితుడి నుంచి రక్త నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ల్యాబ్‌కు పంపనున్నామని, ఫలితాలు వచ్చేంతవరకు ఆయనను ఫీవర్‌ హాస్పటల్ లోనే ఐసోలేషన్‌లో ఉంచనున్నామని తెలిపారు.

మరోపక్క మంకీపాక్స్​పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. 75 దేశాల్లో 16,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. అలాగే.. ఈ వ్యాధితో ఐదుగురు మరణించినట్లు తెలిపారు. సాధారణంగా ఈ వ్యాధి కనిపించని బ్రిటన్‌లో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. జూన్ చివరి వారం నుంచి జులై మొదటివారం వరకు ఈ వైరస్ విస్తరణ వేగం 77 శాతానికి పెరిగింది. గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించడం ద్వారా గణనీయస్థాయిలో ప్రభావం కలిగించే ముప్పుగా మంకీపాక్స్ ను డబ్ల్యూహెచ్ఓ పరిగణిస్తుంది. తద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం కోరే వీలుంటుంది. యూరప్ దేశాలను ఈ కొత్త వైరస్ కు జన్మస్థానంగా భావిస్తున్నారు. స్వలింగ సంపర్కుల్లో ఇది అత్యంత ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు.

మంకీ పాక్స్ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. కానీ సోకినవారికి బాగా సన్నిహితంగా మెలిగినా, తాకినా, వారి వస్తువులు, దుస్తులు ఉపయోగించినా.. వైరస్ సోకే అవకాశం ఉంటుంది. మంకీ పాక్స్ లో రెండు రకాలు ఉన్నాయని ఇంతకుముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అందులో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు మొదటి రకానివని, అది మరీ ప్రమాదకరం కాదని పేర్కొంది.

SHARE