కమాండ్ కంట్రోల్ సెంటర్​ను సందర్శించిన మంత్రులు

ఆగష్టు 4న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలో మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సందర్శించారు. వారితో పాటు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్, పోలీసు ఉన్నతాధికారులున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మహమూద్ ఆలీ మాట్లాడుతూ…తెలంగాణలో శాంతి భద్రతలు బాగున్నాయని, సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తూ కమాండ్ కంట్రోల్ పని చేస్తుందన్నారు. ప్రజల భద్రతలో ఇది ల్యాండ్ మార్క్ అని మంత్రి తలసాని తెలిపారు. సభలు, ప్రమాదాలు, రూల్స్ అతిక్రమించిన వారిని గుర్తించి పోలీస్ లు అక్కడికి సత్వరం చేరుకునేలా పని చేస్తుందన్నారు. దేశానికే ఇది మణిహారమని, దేశంలో మనదే బెస్ట్ లా అండ్ ఆర్డర్ ఉన్న రాష్ట్రమన్నారు. అన్ని అత్యవసర శాఖలను అనుసంధానం చేస్తూ..మానిటరింగ్ ఉంటదన్నారు.

బంజారా హిల్స్‌లో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుతో అనుబంధం ఉన్న అన్ని శాఖ‌ల‌కు సిటీ పోలీసు క‌మీష‌న‌ర్ సీవీ ఆనంద్‌ ఓ మెమోను రిలీజ్ చేశారు. ప్రారంభోత్స‌వానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని ఆయన కోరారు. చ‌రిత్రాత్మ‌క రీతిలో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నిర్మాణం సాగుతోంద‌ని, అయితే లాజిస్టిక్స్‌, ప్లానింగ్‌, ఎగ్జిక్యూష‌న్‌కు సంబంధించిన పెండింగ్ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని కోరారు. క‌మాండ్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వాన్ని గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని, దీని ద్వారా హైద‌రాబాద్ సిటీ పోలీస్ ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప చేయాల‌ని ఆయ‌న త‌న మెమోలో తెలిపారు.

SHARE