మాధవరెడ్డి కారుకు తన పేరున్న స్టిక్కర్ ఉండటంపై మంత్రి మల్లారెడ్డి క్లారిటీ

క్యాసినో వ్యవహారంలో చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో తెల్లవారు జాము వరకు అధికారులు తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేశారు. ఈడీ దాడి సమయంలో మాధవరెడ్డి కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటం చర్చకు దారిసింది.

మాధవరెడ్డి కారుకు తన పేరున్న స్టిక్కర్ ఉండటంపై మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. Mla స్టిక్కర్ తో తనకు ఎలాంటి సంభందం లేదన్నారు.మూడు నెలల క్రితం తాను స్టిక్కర్ పడేశానని చెప్పారు. తాను పడేసిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఎవరో పెట్టుకుంటే తనకేం సంబంధం అన్నారు మంత్రి మల్లారెడ్డి. బుధవారం ఈ ఘటనపై స్పందించిన మల్లారెడ్డి తనకు కేటాయించిన స్టిక్కర్లన్ని తన దగ్గరే ఉన్నాయని తెలిపారు. మాధవరెడ్డి కారుకు ఉన్న స్టిక్కర్ ఫేక్ కావొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కొన్ని గంటల్లోనే మాట మార్చిన మంత్రి మల్లారెడ్డి.. తాను మూడు నెలల క్రితం స్టిక్కర్ పడేశానని చెప్పడం వివాదాస్పదమవుతోంది. మాధవరెడ్డి విషయంలో మల్లారెడ్డి ఏదో దాచుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇక చీకోటి ప్రవీణ్‌, మాధవరెడ్డిలకు సంంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. క్యాసినో చీకటి దందాను వీళ్లిద్దరు చాలా కాలం నుంచే సాగిస్తున్నారని తెలుస్తోంది. గోవా, శ్రీలంక, నేపాల్, థాయ్‌లాండ్‌లలో క్యాసినోలు నిర్వహించారని చెబుతున్నారు.గతంలో పేకాట ఆడించిన కేసుల్లో పోలీసులకు చిక్కాడు ప్రవీణ్. హైదరాబాద్ లోని కొన్ని క్లబ్‌లు వీళ్ల కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రతి ఏటా తన బర్త్ డే రోజున ప్రవీణ్ తెగ హంగామా చేసేవారని తెలుస్తోంది. గత నెలలోనూ చీకోటి జన్మదిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వేడుకకు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్, ఎక్సైజ్‌ అధికారులు హాజరయ్యారని తెలుస్తోంది. సోమవారం నుండి ఈడీ అధికారులు ప్రవీణ్ ను విచారించబోతున్నారు.

SHARE