పాతబస్తీలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పర్యటన

‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ కు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రానున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ లో ఆయన పర్యటించనున్నారు. కార్యకర్తలు, పార్టీ నేతలు, అనుబంధ విభాగాలతో ఆయన భేటీ కానున్నారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ బలోపేతంపై చర్చించనున్నారు. మలక్ పేట, చాంద్రాయణగుట్ట, గోషా మహల్, చార్మినార్, కార్వాన్ అసెంబ్లీ పరిధిలో సింధియా పర్యటన కొనసాగనుంది. సమావేశాలు, పర్యటనల అనంతరం ఫలక్ నుమా ప్యాలెస్ లో సింధియా బస చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు భాగ్యలక్ష్మీ అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఇక రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బిజెపి తీవ్రంగా కృషి చేస్తుంది. ఎనిమిదేళ్ల కాలంలో ఎన్డీయే ఏం చేసిందో ప్రజలకు చెప్పాలని నిర్ణయించింది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆ పథకాలను ఆయా రాష్ట్రాలు క్రెడిట్ చేసుకుంటున్నాయనే ఉద్దేశం కేంద్ర సర్కారులో నెలకొంది. ఇలాంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, ఆయా రాష్ట్రాల తప్పుడు విధానాలను తిప్పికొట్టేందుకు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులను పంపేందుకు అమలుచేస్తున్న కార్యక్రమమే ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. ‘పార్లమెంట్ ప్రవాస్ యోజన’ కింద కేంద్ర మంత్రులను ఒక్కో నియోజకవర్గానికి ఒక ‘ప్రవాస్ మంత్రి’గా కేటాయించింది. తెలంగాణలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్లుగా విభజించారు.

మరోపక్క రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఆగస్టు 02 ప్రజా సంగ్రామ మూడో విడుతను ప్రారభించబోతున్నారు. ఈ మూడో విడత పాదయాత్ర ఇన్చార్జిగా మనోహర్ రెడ్డిని నియమించారు. ఆగస్టు 2న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను ఆహ్వానించారు.

మొత్తం 24 రోజులపాటు యాదాద్రి, నల్గొండ, జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో సాగనుంది. మొత్తం 328 కిలోమీటర్ల మేర మూడవ విడత పాదయాత్ర కొనసాగుందని పార్టీ వర్గాలు తెలిపారు. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్, జనగామ, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు.

ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర చేనేత మంత్రిని ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. ఆగస్టు 26న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో రెండు లక్షల మందితో ముగింపు బహిరంగ సభను భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు దఫాలు ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించిన బండి సంజయ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. ఇదే సమయంలో పార్టీ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని ఇస్తూ బండి సంజయ్ తన పాదయాత్రను కొనసాగించారు. ఇప్పుడు మరోమారు పాదయాత్రకు సిద్ధమయ్యారు.

SHARE