రాజగోపాల్‌రెడ్డి ద్రోహి అంటూ మాణిక్కం ఠాగూర్‌ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ కి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించడం తో కాంగ్రెస్ నేతలు ఆయన ఫై మండిపడుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తో పాటు పలువురు రాజగోపాల్ ఫై నిప్పులు చెరుగగా..తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయ‌డం అంటే… తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తెలంగాణ త‌ల్లి సోనియా గాంధీకి ద్రోహం చేసిన‌ట్టేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన సోనియాకు ద్రోహం చేసిన రాజ‌గోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పేలా మునుగోడు కాంగ్రెస్ శ్రేణులు స‌మాయ‌త్తం కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఇక రేవంత్ రెడ్డి సైతం రాజగోపాల్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. సొంత వ్యాపార ఆర్థిక లావాదేవీల కోసం, కాంట్రాక్టుల కోసం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి లాంటి సోనియా గాంధీని.. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఈడీ దాడులతో వేధిస్తుంటే, కన్నకొడుకులా పోరాటం చేయాల్సిన సమయంలో రహస్య ఒప్పందాలు చేసుకొని పార్టీ మారుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విశ్వాసఘాతుకులను కాంగ్రెస్ పార్టీయే కాదు, యావత్ తెలంగాణ సమాజం క్షమించదని రేవంత్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ అన్ని ఇచ్చిందని..ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్ శ్రేణులు క్షమించరని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ నష్టపోతుందని తెలిసిన ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీదేనన్నారు.

SHARE