కేటీఆర్ బర్త్ డే ను గ్రాండ్ గా జరిపేందుకు తలసాని కుమారుడు ఏర్పాట్లు

జులై 24 తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా జరిపేందుకు ఆయన అభిమానులు , పార్టీ నేతలు , కార్య కర్తలు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా.. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బర్త్ డే వేడుకలను ఆకాశాన్ని తాకేలా ఏర్పాటు చేస్తున్నారు టీఆర్ఎస్ యువనేత, మంత్రి తలసాని కుమారుడు సాయి కిరణ్.

సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా.. తెలంగాణ భవన్లో జరుగుతున్న ఏర్పాట్లను తలసాని సాయి కిరణ్ పరిశీలించారు. ఏ స్థలంలో ఏ కార్యక్రమం నిర్వహించాలో వివరించారు. ఇక పుట్టిన రోజు నాడు పెద్ద ఎత్తున రక్తదానం వంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈసారి కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నేతలు ప్లాన్ చేస్తున్నారు. గతంలోను తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యంలో కేటీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. బర్త్ డే సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి కూడా ఘనంగా నిర్వహించి.. తన సత్తా చాటాలని సాయి కిరణ్ ప్లాన్ చేస్తున్నారు.

తారక రామారావు 1976, జూలై 24న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, శోభ దంపతులకు సిద్ధిపేటలో జన్మించారు. రెండేళ్లపాటు కరీంనగర్ లో చదువుకున్న రామారావు, హైదరాబాదులోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. 1990-91 ఎస్‌ఎస్‌సీ, జీజీ స్కూల్‌, హైదరాబాద్‌.1991-93 ఇంటర్‌, విజ్ఞాన్‌ కాలేజీ, గుంటూరు.గుంటూరులోని విజ్ఞాన్‌లో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి హైదరాబాద్‌ వచ్చి మెడిసిన్‌ ఎంట్రెన్స్‌ రాసిన రామారావుకు కర్ణాటకలోని ఓ మెడికల్‌ కాలేజీలో సీటొచ్చింది. కానీ అది ఇష్టంలేక నిజాం కాలేజీలోని మైక్రోబయాలజీ డిగ్రీలో చేరారు. 1996-98 ఎమ్మెస్సీ, (బయోటెక్నాలజీ) పూణే యూనివర్సిటీ, ముంబాయి. అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ 1998-2000 ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్‌ కంపెనీలో ఐదేళ్ల పాటు ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం చూపడంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటేందుకు 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేసాడు, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ 2లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందాడు. ఈ ఉప ఎన్నికల్లో కేటీఆర్ చురుకైన పాత్ర పోషించాడు. 2008లో మరోసారి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నాడు. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందాడు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచాడు. 2018 డిసెంబరు 17న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనకు ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖలను కేటాయించారు.

SHARE