బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ అతి త్వరలో బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నారని , ఇప్పటికే బిజెపి కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారనే వార్తలు మీడియా లో వైరల్ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ కార్య కర్తలు , ఇతర పార్టీ నేతలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ వార్తలను కోమటిరెడ్డి రాజగోపాల్ ఖండించారు. పార్టీ మార్పుపై గతంలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు.

బీజేపీ నేతలు పిలుస్తున్నారు కానీ..నేనే ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కేసీఆర్ను ఓడించే పార్టీ నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. అమిత్ షాను కలిసింది నిజమేనని.. త్వరలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా అన్నారు. నా నియోజకవర్గానికి డెవలప్మెంట్ నిధులు రాకుండా టీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ విషయానికి వస్తే..భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాజగోపాల్ రెడ్డి 2009లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటిచేసి భారత కమ్యునిస్టు పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తరువాత 2016 నుండి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటిచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.

SHARE