రాష్ట్రం వరదలతో మునిగిపోతుంటే..కేసీఆర్ ఢిల్లీ లో రాజకీయాలు చేస్తున్నారు – కిషన్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో మునిగిపోతుంటే..రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవేమి పట్టించుకోకుండా ఢిల్లీ లో రాజకీయాలు చేస్తున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. మూసీకి వరద రావడంతో నీట మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జిని శనివారం ఆయన పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి ..గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏడాది తర్వాత కూడా మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి మార్పులు రాలేదని మండిపడ్డారు. మూసీ డెవలప్ మెంట్ కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసినా.. ఒక్క అడుగు కూడా ముందు పడలేదని చెప్పారు. ప్రాజెక్టు రిపోర్టు రెడీ అయిందని లోన్లు వస్తున్నాయని చెప్పడం మినహా కేసీఆర్ సర్కారు చేసిందేమీలేదని అన్నారు. ఈసారి కూడా భారీ వర్షాల కారణంగా లక్ష ఇళ్లు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరదలతో ప్రజలు అతలాకుతలమవుతుంటే.. 4 రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ఢిల్లీ లో ఏం చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రశ్నించారు. వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే.. ప్రగతిభవన్​ దాటి బయటికి రాని కేసీఆర్​.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ అండదండలతో కొందరు ఇష్టారాజ్యంగా మూసీని ఆక్రమిస్తున్నందునే ఏటా పేదల ఇళ్లు నీట మునుగుతున్నాయని కిషన్​రెడ్డి ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రాఫిక్స్​తో మభ్యపెట్టింది తప్పితే.. ఒక్క అడుగైనా ముందుకు వేయలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వరదల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

SHARE