నీతి ఆయోగ్ భేటీని బహిష్కరించిన కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర వైఖరి ఫై నిప్పులు చెరిగారు. రేపు ఢిల్లీ లో జరిగే నీతిఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేకపోవడం వల్లే తాను ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. లేఖ ద్వారా నేరుగా ప్రధాన మంత్రి మోడీకి తన నిరసనను తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణ‌యం బాధాక‌ర‌మే అయినా కేంద్రం వైఖ‌రిని ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలియ‌జెప్పేందుకు ఇదే ఉత్త‌మ మార్గ‌మ‌ని భావించామ‌ని ఆయ‌న తెలిపారు.

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చే ముందు దేశ పాల‌న‌ను ఎలా న‌డ‌పాల‌న్న దానిపై విస్తృత స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని కేసీఆర్ చెప్పారు. అందులో భాగంగానే ప్ర‌ణాళికా సంఘం ఆవిర్భ‌వించింద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌ణాళికా సంఘం ద‌గ్గ‌ర వార్షిక‌, పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లు ఉండాల‌ని నాడే నిర్ణ‌యించార‌ని చెప్పారు. నెహ్రూ ప్ర‌ధాని కాగానే… ప్ర‌ణాళికా సంఘం అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని గుర్తు చేశారు. ప్ర‌ణాళికా సంఘంలో ఆయా రంగాల‌కు చెందిన నిష్ణాతులు ఉండేవార‌న్నారు. న‌రేంద్ర మోదీ ప్ర‌ధాని అయ్యాక ప్ర‌ణాళికా సంఘాన్ని ర‌ద్దు చేసి నీతి ఆయోగ్ పెట్టార‌ని ఆయ‌న అన్నారు.

ప్ర‌ణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వ‌చ్చిన త‌ర్వాత నిధుల కేటాయింపు, విడుద‌ల‌లో గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని కేసీఆర్ అన్నారు. 1985లో తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నాడు రూ.5 ల‌క్ష‌ల ప‌నికి కూడా నిధుల విడుద‌ల‌కు ప్లానింగ్ క‌మిష‌న్ ఆమోదం ల‌భించాల్సి ఉండేద‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. నీతి ఆయోగ్ స‌ల‌హాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కేసీఆర్ ఆరోపించారు. ప్ర‌స్తుతం నీతి ఆయోగ్ మేథోమ‌ధ‌నాన్ని వీడి ప్ర‌ధాని మోదీ భ‌జ‌న చేస్తోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని కేసీఆర్ అన్నారు. రూపాయి విలువ పడిపోయిందని.. నిరుద్యోగంతో పాటు ద్రవ్యోల్భణం తీవ్రంగా పెరిగిపోయిందని తెలిపారు. ఇలాంటి అంశాలపై కేంద్రం చర్చించడం లేదని మండిపడ్డారు.

SHARE