భారీ వర్షాలు, వ‌ర‌ద‌ల‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చ‌రిక‌లు

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కలవరపెడుతున్నాయి. గతవారంలో కురిసిన భారీ వర్షాల నుండి ఇంకా ప్రజలు తెలుకముందే మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పలు హెచ్చరికలు జారీ చేసారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఎల్లుండి వరకు ఉద్ధృతంగా.. ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహించే పరిస్థితి ఉందని, ఇటీవలి కంటే ఎక్కువ వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్​ అప్రమత్తం చేశారు. ప్ర‌మాద హెచ్చ‌రిక‌ల‌ను దాటి గోదావరి న‌ది ప్ర‌వ‌హించే అవ‌కాశం ఉన్నందున, గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతాల ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ మొన్నటి మాదిరిగానే వరద ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగు ఏర్పాట్లు చేయాల‌ని సీఎం ఆదేశించారు.

కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్నిశాఖల అధికారులు వారి ఉద్యోగ కేంద్రాలను వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడద‌ని ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే సర్క్యులర్ జారీ చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. వైద్యశాఖ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్ అండ్ బీ, మున్సిపల్, మిషన్ భగీరథ తదితర శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు యంత్రాంగాన్ని కిందిస్థాయి పోలీస్ స్టేషన్ల వరకు ఎస్ఐ, సీఐలతోపాటు, పోలీసు సిబ్బందిని హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

SHARE