గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఆవిష్క‌రించిన ముఖ్యమంత్రి కేసీఆర్

గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్ . గోల్కొండ కోట‌కు చేరుకునే ముందు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఎగుర‌వేసి, సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్‌కు కేసీఆర్ చేరుకున్నారు. అక్క‌డ అమ‌ర జ‌వానుల స్మృతి చిహ్నం వ‌ద్ద కేసీఆర్ నివాళుల‌ర్పించారు. స్వ‌తంత్ర భార‌త స్వ‌ర్ణోత్స‌వ వేళ‌.. భార‌త స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల త్యాగాలను కేసీఆర్ స్మ‌రించుకున్నారు. గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు.

వజ్రోత్సవ సందర్భంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, ఉత్తేజంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకూ, యావత్ భారతజాతికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భమిది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంతరించి, భారతదేశ స్వేచ్ఛకూ, సార్వభౌమాధికారానికీ ప్రతీకగా త్రివర్ణపతాకం ఆవిష్కృతమై నేటితో 75 సంవత్సరాలు పూర్తివుతున్నాయన్నారు. జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర్య పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటున్నామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.

12.01 శాతం ఉత్పత్తిరంగ వృద్ధిరేటుతో పారిశ్రామిక ప్రగతిలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ. ఐటి రంగ ఎగుమతుల్లో దేశంలోకెల్లా అత్యధికంగా 26.14 శాతం వృద్ధిరేటుతో అప్రతిహతంగా దూసుకుపోతున్న రాష్ట్రం మన తెలంగాణ. తెలంగాణకు హరితహారం పథకం సాధించిన ఫలితాలతో రాష్ట్రం ఎటు చూసినా ఆకుపచ్చదనంతో అలరారుతున్నది. ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ అత్యంత బలీయమైన ఆర్థికశక్తిగా ఎదిగింది. దేశ నిర్మాణంలో బలమైన భాగస్వామిగా రూపొందిందన్నారు.

స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా చరిత్రకెక్కిందని ముఖ్యమంత్రి అన్నారు. నేడు యావత్ భారతదేశంలో కరెంటు కోతలు విధించని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందించడం ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యపడిందన్నారు. వ్యవసాయానికి ఉచితంగా, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

SHARE