టిఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పిన కన్నెబోయిన రాజయ్య యాదవ్

కన్నెబోయిన రాజయ్య యాదవ్ టిఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పాడు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి సీఎం కేసీఆర్ వెంట ఉన్న ఈయన..తాజాగా టీఆర్ఎస్‌ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గులాబీ పార్టీతో ఉన్న 22 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు తెలిపారు. ఆ పదవి ఇస్తా.. ఈ పదవి ఇస్తా.. అంటూ సీఎం కేసీఆర్.. తనను ఎన్నోసార్లు మోసం చేశారని ఆయన ఆరోపించారు. పదవుల సంగతి తర్వాత గానీ… కనీసం పలకరించే వారే కరువయ్యారని అన్నారు. పార్టీలో ఆత్మగౌరవం లేదని.. అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.

తెలంగాణ మలి దశ ఉద్యమ టైంలో కేసీఆర్ వెంట నడిచిన రాజయ్య యాదవ్.. రాష్ట్ర సాధన ఉద్యమంలోనూ కీలకంగా వ్యహరించారు. కేసీఆర్‌తో పాటు ఆమరణ దీక్షకు దిగిన ఆరుగురు సీనియర్ నేతలతో రాజయ్య యాదవ్ ఒకరు. కరీంనగర్ అలుగునూర్ వద్ద అరెస్టై ఖమ్మం జైలులో కేసీఆర్‌తో పాటు జైల్లోనూ గడిపారు రాజయ్య యాదవ్. గతంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్‌గా రాజయ్య యాదవ్ పని చేశారు కూడా. అలాంటి ఆయన గుడ్ బై చెప్పడం అందరికి షాక్ ఇస్తుంది. తనతో పాటు మరికొందరు పార్టీ వీడెందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌లో చాలా మార్పు వచ్చిందని, మునుపటిలా పార్టీ సీనియర్లను గౌరవించడం లేదని, కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తనయుడు కేటీఆర్‌ కోసం పార్టీ సీనియర్లను కేసీఆర్‌ తొక్కిపడేశారని, పార్టీతో సంబంధలేని వాళ్లు, బయటివాళ్లదే టీఆర్‌ఎస్‌ రాజ్యమయ్యిందని రాజయ్య యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం పోరాడామని, సాధించిన రాష్ట్రంలో ఉద్యమకారులకే స్థానం లేకుండా పోయిందని, కొంతమంది బాధలో ఉన్నారని, తాను మాత్రం ఆ బాధ నుంచి విముక్తి చెందుతున్నానని పేర్కొన్నారు.

SHARE