కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేం – కేంద్రం క్లారిటీ

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వలేమని మరోసారి కేంద్రం చెప్పేసింది. లోక్ సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానం ఇచ్చారు. జాతీయ ప్రాజెక్టు కింద చేర్చడానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు అర్హత లేదని స్పష్టం చేశారు. 2016, 2018లో ముఖ్యంత్రి కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వివరించారు.

జాతీయ హోదా కావాలంటే.. సీడబ్ల్యూసీ అధ్యయనం తప్పనిసరని, ప్రాజెక్టు అడ్వైజరీ కమిటీ కూడా ఆమోదం ఉండాలని, ప్రాజెక్టు పెట్టుబడులపై కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ పరిశీలించాలని, హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ అనుమతి ఇస్తే కాళేశ్వరానికి జాతీయ హోదా అవకాశం ఉంటుందని లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు. దీంతో ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదని మరోసారి క్లారిటీ వచ్చినట్లయ్యింది.

SHARE