బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్న నటి జయసుధ..?

తెలంగాణ లో బిజెపి ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. ఇప్పటికే ఎంతోమందిని తమ పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి..తాజాగా మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధను తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. బీజేపీ జాయినింగ్‌ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేంద్ర.. మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధతో మంగళవారం సమావేశమై పార్టీలో చేరికకు సంబంధించిన చర్చలు దాదాపు పూర్తిచేసినట్లు సమాచారం.

జయసుధ గతంలో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆమె రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. సికింద్రాబాద్‌ నియోజకవర్గ పరిధిలో జయసుధ కొంత పట్టుండటంతో ఆమెను పార్టీలోకి తీసుకొనేందుకు బీజేపీ ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌ షా పర్యటన సందర్భంగా పార్టీలో చేరాలని ఈటల రాజేంద్ర.. జయసుధను కోరినట్లు సమాచారం. ఆమె కూడా కాస్త బిజెపి లో చేరేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు వినికిడి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇదిలాఉంటే తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర అగ్ర నాయకత్వంసైతం తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్త నేతలను బీజేపీలోకి చేర్చుకొనేందుకు సిద్ధమయ్యారు. తాజాగా బీజేపీ మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ కు తెలంగాణలో గట్టి ఎదురు దెబ్బతగిలింది.

SHARE