హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం

హైదరాబాద్ ను వర్షం వీడట్లేదు. ప్రతి రోజు వర్షం పడుతూ నగరాన్ని తడిసిముద్ద చేస్తుంది. నిన్న కాస్త తెరిపించిందనుకునేలోపే..ఈరోజు నగరంలో కుండపోతవర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఫుల్ గా ఎండకొట్టగా..ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది. చిన్న చిన్న చినుకులతో మొదలైన వర్షం..భారీవర్షంగా మారింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగిపోయాయి.అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

బేగంపేట్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ , సికింద్రాబాద్, సనత్ నగర్ ,అమీర్పేట్, కొత్తపేట్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, చంపాపేట్, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదీగూడ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. బషీర్ బాగ్, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బేగం బజార్ తరిత ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేరేడ్ మెట్ లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది.

SHARE