తెలంగాణ లో మరో రెండు రోజుల పాటు వర్షాలే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడిన ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించినట్టు తెలిపింది. దీని ప్రభావం వల్ల నారాయణపేట, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది.

అలాగే ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపలల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. భారీ వర్షాలతో అతలాకుతలం అయిన మెతుకుసీమ తేరుకుంటోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గిపోయింది. గంటల వ్యవధిలోనే సింగూరు ప్రాజెక్టుకు వరద తగ్గిపోవడంతో ప్రాజెక్టు మూడు గేట్లు మూసివేశారు. శనివారం భారీ వరద పోటెత్తడంతో ఎత్తిన 9, 10, 11 నంబర్ల మూడు గేట్లు గేట్లు మూతపడ్డాయి. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టుకు 11 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.

గత వారం కూడా ఎడతెరిపి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు వందలాది ఇల్లు నీటిలో మునగగా..రాష్ట్ర వ్యాప్తంగా 1400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర సర్కార్ ..కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపింది.

SHARE