హైదరాబాద్ లో భారీ వర్షం..ఎక్కడిక్కడే నిలిచిపోయిన వాహనాలు

హైదరాబాద్ ను వరణుడు వదిలిపెట్టడం లేదు. ప్రతి రోజు నగరవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఈరోజు ఉదయం నుండి వర్షం దంచికొడుతుండడంతో ఎక్కడిక్కడే వాహనాలు నిలిచిపోయాయి. కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, బాలానగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆఫీసులకు , పలు పనులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు జారీచేసింది. ఇక ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌, జవహర్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేని వానకు నాలాలు పొంగి ఆ నీరంతా రోడ్లపైకి చేరుతోంది. మురుగు కంపు కొడుతున్న నీటివల్ల స్థానికులు అవస్థలు పడుతున్నారు.

అసలే వర్షాకాలం.. ఇక ఈ నాలాల నీటి వల్ల దోమలు ఎక్కువవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే వైరల్, టైఫాడ్, డెంగీ జ్వరాలతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పొంగుతున్న నాలాల వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు. నగరంలో గత 15 రోజులుగా రోజూ ఏదొక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. ఈ వర్షాలు ఎప్పుడు ఆగుతాయా అని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.

SHARE