హైదరాబాద్ లో కుండపోత వర్షం ..లోతట్టు ప్రాంతాలు జలమయం

మరోసారి వరణుడు హైదరాబాద్ ఫై విరుచుకపడ్డాడు. ఉదయం నుండి నగరంలో వర్షం పడుతుండగా..సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం పడింది. సుచిత్ర, చింతల్‌, కొంపల్లి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, రసూల్‌పురా, తిరుమలగిరి, బొల్లారం, కుషాయిగూడ, చిలకలగూడ, బేగంపేట్‌, కాప్రా, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పలు కాలనీల్లోకి వరద నీరు నివాసాల్లోకి చేరింది. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పలు కాలనీల్లో విద్యుత సరఫరాకు అంతరాయం కలిగింది. ఇక రోడ్ల ఫై ఎక్కడిక్కడే ట్రఫిక్ జాం అయ్యింది.

రాబోయే మూడు గంటల్లో హైదరాబాద్‌ వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగర వాసులు ఇండ్లకే పరిమితం కావాలని సూచించింది. రాబోయే 3 గంటల్లో 100 మి.మీ. పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ వర్షం జూలై నెలలో అతిపెద్ద వర్షంగా భావించొచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. కార్యాలయాలు, వ్యాపార సముదాయాల నుంచి తమ నివాసాలకు వెళ్లే వారు.. జాగ్రత్తలు పాటించాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే వాహనదారులు రోడ్లపైకి రావొద్దని విజ్ఞప్తి చేశారు. వర్షం ఆగిన గంట తర్వాత రహదారులపైకి రావాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

ఉప‌రిత‌ల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు విస్తారంగా వ‌ర్షాలు కూరుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర, ద‌క్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడ‌క్కడ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని.. ఈ రోజు భారీ నుండి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం పేర్కొంది.

SHARE