భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..భయాందోళలో ముంపు ప్రజలు

మరోసారి భద్రాచలం ముంపు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. కొద్దీ రోజుల క్రితం భారీ వరదలకు గోదావరి నీటిమట్టం 70 అడుగుల మేర ప్రవహించిన సంగతి తెలిసిందే. దీంతో భద్రాచలం ముంపు గ్రామాలతో పాటు భద్రాచలం లోని పలు కాలనీ లు నీటమునిగాయి. దాదాపు వారం రోజుల పాటు ముంపు గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలలో ఉన్నారు.

ఇక ఇప్పుడు మరోసారి భయం భయంగా బ్రతుకుతున్నారు. గత రెండు , మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతుండడం తో గోదావరికి వరద ప్రవాహం ఎక్కువైంది. గంట గంటకు ప్రవాహం ఎక్కువవుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గోదావరి నీటిమట్టం 41.2 అడుగులుగా ఉన్నది. ప్రస్తుతం నదిలో 8,56,949 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదిలోకి ప్రవాహం పెరుగుతున్నది.

ప్రస్తుతం 41.2 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతుండగా.. 43 అడుగులకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులకు వరద చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. 53 అడుగుల దాటితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి, రెడ్ అలెర్ట్ ప్రకటిస్తారు.

SHARE