కాళేశ్వరం కేసీఆర్కు ఏటీఎంలా మారిందంటూ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆగ్రహం

బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం సందర్బంగా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ కు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ..కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు డబ్బు సంపాదించే మిషన్ గా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్… ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని విమర్శించారు.

రాష్ట్రంలో బీజేపీ జంగ్ సైరన్ మోగించిందని..వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ నాయకత్వంలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్న ఆయన.. ఇక్కడి ప్రజలు సుష్మా స్వరాజ్ను చిన్నమ్మగా పిలుచుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందని..కేసీఆర్ కుటుంబ పాలన అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలకు మాత్రమే కేసీఆర్ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అణగారిన వర్గాలంటే కేసీఆర్ కు గిట్టదన్నారు. ఎంతో పవిత్ర స్థలమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బండి సంజయ్ పాదయాత్రను ప్రజలు ఆశీర్వదించారని..మూడవ విడత పాదయాత్ర కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

SHARE