పాలమూరు లిఫ్ట్ పనుల్లో ప్రమాదం.. ఐదుగురు కూలీల మృతి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది. పంప్‌హౌస్‌లోకి క్రేన్‌ దించుతుండగా..క్రేన్‌ వైరు తెగిపోవడం తో ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కొల్లాపూర్ మండలం ఏల్లూరు శివారులోని రేగమనగడ్డ వద్ద నిర్మాణం జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో క్రేన్ సాయంతో పంపు హౌస్‌లోని కార్మికులు దిగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పంపు హౌస్‌లోకి దిగుతుండగా క్రేన్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మణం చెందారు. ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు జార్ఖండ్ కు చెందిన భోలేనాథ్ (45), ప్రవీణ్ (38), కమలేష్ (36 ), బీహార్ కు చెందిన సోను కుమార్ (36), ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీను (40)గా గుర్తించారు.

ఈ ఘటనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పందించారు. ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ మేరకు రేవంత్​రెడ్డి ట్వీట్​ చేశారు. మరోవైపు జూన్ 10వ తేదీన పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నేషనల్ లేబర్ కమిషన్ చైర్మన్ పపరిశీలించారు. నిర్మాణ పనుల్లో రక్షణ చర్యలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా లోపాలపై ఇరిగేషన్ అధికారులను హెచ్చరించారు. అయినా.. కాంట్రాక్టు ఏజెన్సీ, అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇవాళ ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

SHARE