ముగిసిన ఈడీ సోదాలు..ప్రవీణ్ చీకోటి ఇంటి నుండి ల్యాప్‌టాప్, మొబైళ్ల స్వాధీనం

క్యాసినో వ్యవహారంలో ఈడీ సోదాలు ముగిశాయి. చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో తెల్లవారు జాము వరకు అధికారులు తనిఖీలు నిర్వహించారు. సైదాబాద్, బోయిన్ పల్లి, కడ్తాల్ లలో దాదాపు 20 గంటల పాటు సోదాలు కొనసాగాయి. ప్రవీణ్ ఇంటి నుంచి మొబైల్స్, ల్యాప్ టాప్ లతో పాటు పలు డాక్యుమెంట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. విదేశాల్లో క్యాసినోల పేరిట ఫెమా నిబంధనలు ఉల్లంఘించి మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారనే ఆరోపణలతో క్యాసినో నిర్వాహకులైన చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ దాడులు నిర్వహించింది.

చీకోటి ప్రవీణ్ ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు క్యాసినో ద్వారా జరిగిన హవాలా లావాదేవీలు మాత్రమే కాకుండా బంగారం దందా వ్యవహారంలోనూ అతడికి సంబంధాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. చెన్నైకి చెందిన ప్రముఖ బంగారు వ్యాపారికి హవాలా ద్వారా డబ్బు సమకూర్చి.. తాను బ్లాక్ మార్కెట్ ద్వారా బంగారం తీసుకున్నట్లు ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని ఈడీ అధికారులు చెబుతున్నారు. మొదట్లో గోవాలోని ఓ క్యాసినోలో టేబుల్ నిర్వాహకుడిగా ఉన్న చికోటి ప్రవీణ్.. ఆ తర్వాత విదేశాల్లో క్యాసినోలతో కోట్లకు పడగలెత్తినట్లు ఈడీ గుర్తించింది.

గోవా, శ్రీలంక, నేపాల్‌, థాయ్‌లాండ్‌లలో క్యాసినోల నిర్వహణతో పాటు స్థానికంగానూ జూదం సాగించి అనేకసార్లు పోలీసులకు చిక్కిన ఉదంతాలున్నాయి. నగరంలోని కొన్ని క్లబ్‌లు కూడా ఇతడి కనుసన్నల్లో కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు బోయిన్‌పల్లిలో నివాసం ఉండే మాధవరెడ్డి 6 నెలల క్రితం వరకు ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పనిచేసేవాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మాధవరెడ్డి ప్రవీణ్‌ దందాలో భాగస్వామిగా చేరిన తర్వాత బాగా సంపాదించినట్లు తెలుస్తోంది. ఈడీ దాడి సమయంలో మాధవరెడ్డి కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటం గమనార్హం.

SHARE