టి కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ : దాసోజు శ్రవణ్ రాజీనామా

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ తన పదవికి , పార్టీ కి రాజీనామా చేయగా..తాజాగా ఐసీసీసీ అధికార ప్రతినిధి పదవికి,కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు దాసోజు శ్రవణ్ ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అది చూసి తట్టుకోలేకనే పార్టీని వీడుతున్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తున్నారని.. కాంగ్రెస్ ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి తన సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీని ఒక మాఫియాగా నడిపిస్తున్నారని, కేవలం వ్యక్తిగత ఇమేజ్‌ కోసం పాకులాడుతున్నాడని దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు.

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ పదవిని ఫ్రాంచైజీలా తెచ్చుకున్నారు. ప్రతి నియోజవర్గంలో ముగ్గురు లేదంటే నలుగురిని ప్రోత్సహిస్తూ సొంత ముఠా తయారు చేసుకుంటున్నారు. ఏదో ప్రైవేట్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌లా పార్టీని నడుపుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత కులం, ధనంతోనే పార్టీలో రాజకీయం నడుస్తోంది. రేవంత్‌ వద్ద ఎల్‌1, ఎల్‌2 దర్శనాలు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో అగ్రకులాల దురహంకారం నడుస్తోంది. సగటు కాంగ్రెస్‌ కార్యకర్తల ఆశలను రేవంత్‌ నీరుగారుస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. మాణిక్కం ఠాగూర్, రేవంత్, సునీల్ కనుగోలు ముగ్గురూ కుమ్మక్కయ్యారన్నారు. రేవంత్ తప్పులు చేస్తుంటే ఠాగూర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాఫియాను నడిపినట్టు పార్టీ నడుపుతున్నారని ధ్వజమొత్తారు. ఏఐసీసీ నుండి పార్టీని రేవంత్ లీజ్ కు తీసుకున్నట్లుగా ఉందన్నారు.

పేదలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని..పేదోళ్ల గొంతుకగా ఉండాలని ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వచ్చానని శ్రవణ్ చెప్పారు. జైపూర్ సభలో రాహుల్ ప్రసంగం విని ఆకర్షితుడినై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పార్టీ కోసం అహర్నిశలు పనిచేశానని చెప్పారు. కానీ పార్టీ సిద్ధాంతాలకు రేవంత్ వ్యవహరిస్తుండటంతో తాను చాలా విసిగిపోయాననని…ఏడాది కాలంగా ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపానని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే బాధతో కాంగ్రెస్‌ను వీడుతున్నా అని ప్రకటించారు.

SHARE