రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాజగోపాల్ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలనీ కాంగ్రెస్ పార్టీ పిలుపు

కాంగ్రెస్ పార్టీ కి అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం రేవంత్ రెడ్డి రాజగోపాల్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాజగోపాల్ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలనీ పార్టీ పిలుపునిచ్చింది. సొంత వ్యాపార ఆర్థిక లావాదేవీల కోసం, కాంట్రాక్టుల కోసం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోతున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి లాంటి సోనియా గాంధీని.. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఈడీ దాడులతో వేధిస్తుంటే, కన్నకొడుకులా పోరాటం చేయాల్సిన సమయంలో రహస్య ఒప్పందాలు చేసుకొని పార్టీ మారుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి విశ్వాసఘాతుకులను కాంగ్రెస్ పార్టీయే కాదు, యావత్ తెలంగాణ సమాజం క్షమించదని రేవంత్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ అన్ని ఇచ్చిందని..ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్ శ్రేణులు క్షమించరని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ నష్టపోతుందని తెలిసిన ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత సోనియా గాంధీదేనన్నారు. ఈ నెల 5న మునుగోడులో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని…ఆరోజు కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహాన్ని ప్రదర్శిస్తామన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన నేపథ్యంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలో కొనసాగడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలోనే ఉంటారు. ఆయన క్రమ శిక్షణ కలిగిన నేత. పార్టీలో ఎన్నో హోదాలలో పనిచేశారు. మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించేందుకు కృషి చేస్తారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడతాడు’’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాజగోపాల్ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలనీ పార్టీ పిలుపునిచ్చింది.

SHARE