ఈరోజు ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్ టీం

క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ తో పాటు అతడి గ్యాంగ్ ను ఈరోజు ఈడీ అధికారులు విచారించబోతున్నారు. ఇప్పటికే వీరి ఇళ్లల్లో సోదాలు జరిపిన అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆధారాలను బట్టి విచారించబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించి, వారిని విదేశాల్లో క్యాసినో ఆడించి లాటరీ డబ్బులను పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు ఈడీ గుర్తించింది.

విదేశాల్లో క్యాసినో పై ఈడీ అధికారులు వీరిని ప్రశ్నించనున్నారు. ఇద్దరు నిర్వాహకులు సహా నలుగురు హవాలా బ్రోకర్స్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ప్రవీణ్, మాధవరెడ్డిలకు హవాల రూపంలో సంపత్, బబ్లు, రాకేష్, వెంకటేష్ అనే నలుగురు ఏజెంట్లు నగదు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు

ఈడీ స్వాధీనం చేసుకున్న ఫోన్ వాట్సాప్‌లో కీలకమైన సమాచారం బయటపడినట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు, సినీతారలతో అతడు చేసిన వాట్సాప్ ఛాటింగ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. బిగ్ డాడీ అడ్డా ప్రమోషన్ కోసం తారలతో ఎర వేసిన ప్రవీణ్.. ప్రముఖ హీరోయిన్లతో చేయించిన ప్రోమోలను వాట్సాప్‌లో బడాబాబులకు పంపించినట్లు అధికారులు గుర్తించారు. చీకోటీ ప్రవీణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 200 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు తేలింది.

నేపాల్, ఇండోనేషియాలో క్యాసినో ఆడటానికి వారి నుంచి సుమారు రూ.5లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసేవాడు. రూ.5లక్షలు ఇచ్చిన కస్టమర్లను సాధారణ విమానాల్లో, అంతకుమించి చెల్లించిన కస్టమర్లను ప్రత్యేక విమానాల్లో నేపాల్‌కి పంపించేవాడు. దేశాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేసేవాడు. విదేశాల్లో క్యాసినోలు నిర్వహించి ఆ లావాదేవీలను హవాలా రూపంలో నిర్వహించే వాడాడట. మరి ఈరోజు ఈడీ విచారణలో ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాలి.

SHARE