చీకోటి ప్రవీణ్‌ ను విచారిస్తున్న ఈడీ అధికారులు

క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ తో పాటు అతడి గ్యాంగ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. బ్యాంకు స్టేట్‌మెంట్లు, నోటీసు కాపీతోపాటు అడ్వకేట్‌ను ప్రవీణ్‌ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతున్నది. విదేశాల్లో క్యాసినో నిర్వహణ, హవాలా రూపంలో నగదు బదిలీలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విచారణ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇప్పటికే వీరి ఇళ్లల్లో సోదాలు జరిపిన అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆధారాలను బట్టి విచారించబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించి, వారిని విదేశాల్లో క్యాసినో ఆడించి లాటరీ డబ్బులను పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు ఈడీ గుర్తించింది.

విదేశాల్లో క్యాసినో పై ఈడీ అధికారులు వీరిని ప్రశ్నించనున్నారు. ఇద్దరు నిర్వాహకులు సహా నలుగురు హవాలా బ్రోకర్స్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ప్రవీణ్, మాధవరెడ్డిలకు హవాల రూపంలో సంపత్, బబ్లు, రాకేష్, వెంకటేష్ అనే నలుగురు ఏజెంట్లు నగదు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

ఈడీ స్వాధీనం చేసుకున్న ఫోన్ వాట్సాప్‌లో కీలకమైన సమాచారం బయటపడినట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు, సినీతారలతో అతడు చేసిన వాట్సాప్ ఛాటింగ్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. బిగ్ డాడీ అడ్డా ప్రమోషన్ కోసం తారలతో ఎర వేసిన ప్రవీణ్.. ప్రముఖ హీరోయిన్లతో చేయించిన ప్రోమోలను వాట్సాప్‌లో బడాబాబులకు పంపించినట్లు అధికారులు గుర్తించారు. చీకోటీ ప్రవీణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 200 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు తేలింది.

SHARE