భద్రాచలం ముంపు గ్రామాల్లో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత , ఏపీ మాజీ సీఎం చంద్రబాబు..ఈరోజు భద్రాచలం ముంపు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. గోదావరి నదికి వరద నీరు పోటెత్తడంతో తెలంగాణ, ఏపీలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎన్నో గ్రామాలు నీట మునిగాయి. భద్రాచలం, చుట్టుపక్కల మండలాలన్నీ వారం రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయాయి. పోలవరం ప్రాజెక్టు విలీన మండలాలన్నీ నీట మునిగాయి. ఈ నేపథ్యంలో విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు.

చంద్రబాబుకు గ్రామ గ్రామాన అభిమానులు ఘనస్వాగతం పలుకుతున్నారు. మోటార్ సైకిల్ ర్యాలీలు, కార్ల ర్యాలీలతో చంద్రబాబుకు యువకులు స్వాగతం పలికారు. జై చంద్రబాబు జైజై చంద్రబాబు నినాదాలతో వీధులు మార్ర్మోగుతున్నాయి. ‘‘గోదావరి ముంపు ప్రాంతాలలో ప్రజలు సర్వంకోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.. వారికి ధైర్యం చెప్పి అండగా నిలిచేందుకు వెళుతున్న.. మరోసారి మీ ప్రాంతానికి మీమీ గ్రామానికి వచ్చి తప్పని సరిగా మీ అందరినీ కలుస్తాను’’ అని చెబుతూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. రాత్రికి ఆయన భద్రాచలంలో బస చేయనున్నారు. రేపు ఏపీకి చెందిన ఎటపాక, వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని కోతులగుట్ట, తోటపల్లి, రేఖపల్లి, కూనవరం ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు.

SHARE