తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్ ధాన్యం సేకరణ పై ఎఫ్సిఐ కి కేంద్రం క్లియరెన్స్ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రాజకీయ ఎజెండాతోనే కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం నిందలు వేస్తోందని పీయూష్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమని, రాష్ట్ర సీఎం, మంత్రులు అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులపై టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు బాధాకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీరు వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ మిల్లుల్లో నిల్వ సౌకర్యాలు సరిగా లేవని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. తాము ఎన్నిసార్లు లేఖలు రాసిన తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని పీయూష్ గోయల్ విమర్శించారు.

ప్రధానమంత్రి అన్న యోజన కింద ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని.. అందుకే సెంట్రల్ పూల్‌లోకి బియ్యం సేకరించడాన్ని నిలిపివేశామని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వమే సృష్టించిందని విమర్శించింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం మండిపడింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే విషయాన్ని గుర్తించామని పేర్కొంది.

SHARE