కరీంనగర్ లో దీక్ష చేస్తున్న బండి సంజయ్

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ అరెస్టులు, దాడులు, నిర్బంధాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. కరీంనగర్ లోని తన ఇంటివద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిరసన దీక్ష చేపట్టారు. మరోపక్క బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం పోలీసుల అనుమతితో బండి సంజయ్..జ్యోతినగర్ లోని మహాశక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్‌ కుంభోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు కవిత ఇంటి దగ్గర నిరసనకు దిగారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసి..వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనికి నిరసనగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్‌ దీక్ష చేపట్టారు. దీంతో ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయన్ను కరీంనగర్ లోని బండి సంజయ్ ఇంటికి తరలించి గృహనిర్భంధం చేశారు.

మరోపక్క ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేతపై బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బండి సంజయ్ తరపున లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

SHARE