మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర పోస్టర్ ను విడుదల చేసిన బిజెపి

ఆగస్టు 2వ తేదీ నుండి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టబోతున్నారు. దీనికి సంబదించిన పోస్టర్ ను బిజెపి విడుదల చేసింది. ఈ పాదయాత్ర ఆగస్టు 2 నుంచి 26 వ తేదీ వరకు సాగనుంది. ఈ మూడో విడత పాదయాత్ర ఇన్చార్జిగా మనోహర్ రెడ్డిని నియమించారు. ఆగస్టు 2న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను ఆహ్వానించారు.

మొత్తం 24 రోజులపాటు యాదాద్రి, నల్గొండ, జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో సాగనుంది. మొత్తం 328 కిలోమీటర్ల మేర మూడవ విడత పాదయాత్ర కొనసాగుందని పార్టీ వర్గాలు తెలిపారు. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్, జనగామ, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు.

ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర చేనేత మంత్రిని ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. ఆగస్టు 26న వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో రెండు లక్షల మందితో ముగింపు బహిరంగ సభను భారీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు దఫాలు ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించిన బండి సంజయ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు. ఇదే సమయంలో పార్టీ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని ఇస్తూ బండి సంజయ్ తన పాదయాత్రను కొనసాగించారు. ఇప్పుడు మరోమారు పాదయాత్రకు సిద్ధమయ్యారు.

SHARE